సీమాంధ్రకి మంచి ప్యాకేజీ బెటర్

ఆంద్రప్రదేశ్ భవిష్యత్తు ఏమవుతుంది?ఇది అందరి మనసులలో తొలుస్తున్న ప్రశ్న. ఏదో విధంగా పరిష్కారం కావాలని అందరం కోరుకుంటున్నాం.కాని ఎవరూ దానికి దోహదపడరు. ముఖ్యంగా దీనిని పరిష్కరించవలసిన రాజకీయ నేతలు తమలో తాము కలహించుకుంటూ సమస్య పరిష్కారం కాకుండా చూస్తున్నారు.వీరు వాదనల వరకే పరిమితం కాకుండా పంతాలు,పట్టింపులతో రాష్ట్రాన్ని, ప్రజలను నాశనం చేస్తున్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదిష్టానం వద్ద చేసిన వాదనలో కాని, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ వాదనలో కాని రాష్ట్రాన్ని విడదీస్తే వచ్చే చిక్కుముళ్ల గురించి చెబితే, ఆ చిక్కుముళ్లను విడదీయడం కష్టం కాదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వాదించారు.ఇప్పటికే కాంగ్రెస్ హై కమాండ్ నేతలు ప్రణబ్ కమిటీ. శ్రీకృష్ణ కమిటీలను వేసి బోలెడంత సమాచారం సేకరించినా,చివరికి వాటన్నిటిని బుట్టదాఖలా చేసి, మళ్లీ చర్చలు పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ నేతల మద్య తంపులు పెట్టారు. ఒకరకంగా చూస్తే సమస్య పరిష్కారంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించడం మంచిదే అయినా, రాష్ట్రంలో పాలన బాధ్యతలను నిర్వహించే ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి పరస్పర భిన్నమైన వాదనలు చేయించడం ద్వారా నేతలను ప్రాంతాల వారీగా అదిష్టానమే విడదీసినట్లుగా ఉంది. సమైక్య ఆంద్ర స్టార్ బ్యాట్స్ మన్ కిరణ్ కుమార్ రెడ్డి అయితే, తెలంగాణ వాద స్టార్ బ్యాట్స్ మన్ గా జైపాల్ రెడ్డి అవతరించారు. అసలు బ్యాట్స్ మన్ తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు ప్రస్తుతం మళ్లీ బాటింగ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.ఈలోగా కాంగ్రెస్ పార్టీ ప్రాంతాలవారీగా రెండుగా చీలిపోయింది. మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్,.పిలు ఇలా అందరూ చీలిపోయారు.చివరికి మంత్రులు పరస్పరం కూర్చుని విందులో పాల్గొనే పరిస్థితి కూడా లేదని ఒక ఆంగ్ల పత్రిక కధనాన్ని ఇచ్చింది. ఇది దారుణమైన విషయం. మంత్రి అంటే రాష్ట్రం అంతటికి మంత్రి.కాని దురదృష్టం మన రాష్ట్రంలో మంత్రి అంటే ఒకే ప్రాంతానికి పరిమితం అయిన పరిస్థితి దాపురించింది. దీనికి కాంగ్రెస్ హై కమాండే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి కిరణ్ తన వాదనను సమర్ధంగా వినిపించారన్న భావన సమైక్యవాదులలో ఉంది. ఆయన వేసిన ఒక ప్రశ్నకు అదిష్టానం సమాధానం చెప్పలేకపోయినట్లు కనిపిస్తుంది.రెండువేల తొమ్మిది డిసెంబరు మొదటివారంలో కెసిఆర్ 14 ఎఫ్ రద్దు కోసం దీక్షకు దిగితే కేంద్రం ఏకంగా తెలంగాణ ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు.మరో మాట ఆయన అడిగారో లేదో తెలియదు. అసలు కెసిఆర్ నిమ్స్ లో సెలైన్ దీక్ష అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో చేస్తుంటే, ఆయన ఆరోగ్యం క్షీణించిందని స్వయంగా కేంద్రమే అబిప్రాయపడితే ,అది సమర్దత అనిపించుకుంటుందా అని కూడా ప్రశ్నించి ఉండాల్సింది.తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం ఇక్కడ అంశం కాదు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పరిశీలన చేసి తెలంగాణ ఇవ్వవచ్చు.అభ్యంతరం లేదు. కాని అలా కాకుండా అవాస్తవ సమాచారం ప్రాతిపదికన కేంద్రం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కిరణ్ ప్రధాని మన్మోహన్ , పార్టీ అదినేత్రి సోనియాగాంధీతో పాటు ఇతర పెద్దల మొహానే ప్రశ్నించిన తీరు కరెక్టని చెప్పాలి.దీనికి అదిష్టానం వద్ద సమాధానం ఉండవకపోవచ్చు. అప్పటి పరిస్థితులలో అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి కనుక తెలంగాణకు అనుకూలంగా ప్రకటించామని చెప్పి ఉండవచ్చు.ఇక ముఖ్యమంత్రి కిరణ్ లక్ష పది వేల కోట్ల ప్యాకేజీని తెలంగాణకు ఇవ్వవచ్చని ప్రతిపాదించారు.ఇది వినడానికి బాగానే ఉంది.నిజానికి సీమాంధ్ర, తెలంగాణలలో ఎవరికి బారీగా ప్యాకేజీ వచ్చినా సంతోషించాలి.దానిని ఒప్పుకుంటే తెలివైన పనిగా అంగీకరించాలి.కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎమ్.పి వి.హనుమంతరావు వంటివారు వెంటనే ఆక్షేపించారు.ఆ ప్యాకేజీ ఏదో ఆంధ్రకే ఇవ్వండని అన్నారు. ఆ డబ్బులు తీసుకుని మమ్మల్ని వదలిపెట్టండని ఆయన నిష్టూరమాడారు.అలాగే పాల్వాయి గోవర్ధనరెడ్డి కూడా మాట్లాడారు.టిఆర్ఎస్ నేతలదీ అదే అబిప్రాయం.ఇది తమ ఆత్మగౌరవ సమస్యగా ప్రచారం చేస్తున్నారు.ఇక్కడ ప్రజల అవసరాల కన్నా, నేతలకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమన్న భావన కలిగించడానికి వారు వెనుకాడడం లేదు.స్వయంపాలన నినాదం అంటే ముఖ్యమంత్రి పదవే.భావోద్రేకాలు బాగా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఈ ప్యాకేజీలను అంగీకరించకపోవచ్చు. కిరణ్ తన వాదనలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ ప్రాంతం ఎలా నష్టపోతుందో కూడా వివరించారు. ప్రత్యేకించి తెలంగాణలో వ్యవసాయికంగా, విద్యుత్ పరంగా చాలా లోటులో ఉంది. హైదరాబాద్ రాజధానిగా ఉండి అభివృద్ది చెందింది కాబట్టి కొంత ఆదాయం ఉండవచ్చు. కాని ఒకసారి రాష్ట్రం విడిపోయాక, హైదరాబాద్ కూడా కొంతకాలం ఇబ్బంది పడుతుంది.ఇక్కడ రియల్ ఎస్టేట్ విలువలు తగ్గుతాయి. ఇలా అనేక సమస్యలు రావచ్చు. అయినప్పట్టికీ తెలంగాణ నేతలు దాదాపు అందరూ తమకు తెలంగాణ కావల్సిందేనని పార్టీలకు అతీతంగా చెబుతున్నారు. సీనియర్ నాయకుడు జి.సంజీవరెడ్డి, విప్ జగ్గారెడ్డి వంటి కొద్ది మంది సమైక్య రాష్ట్రమే బెటర్ అని చెబుతున్నా,వారిని పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల కిరణ్ సూచించినట్లుగా లక్షా పదివేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన తర్వాత , ఆ డబ్బు ఖర్చు అయిపోయాక, మళ్లీ ఇదే కెసిఆర్ ,లేక మరో కెసిఆర్ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోరన్న గ్యారంటీ ఏముంది?నిజానికి తెలంగాణలోని అనేక జిల్లాలు కోస్తా జిల్లాలతో పోటీ పడి అబివృద్ది చెందాయి.అయినా కూడా ఇంత భారీ మొత్తాన్ని ప్యాకేజీగా ప్రకటించాలని కోరడం ద్వారా తెలంగాణలో అబివృద్ది అంతగా జరగలేదన్న అబిప్రాయాన్ని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నట్లయింది. అయితే ఆయన ఆ మాటను ఒప్పుకోవడం లేదు. ప్రజలలో సెంటిమెంటు ఉన్నప్పుడు ఇలాంటి వాటి ద్వారా వారికి మేలు చేయాల్సిన బాధ్యత ఉంది కదా అన్నది ఆయన భావన. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు. కాని తెలంగాణ నేతలు ఒప్పుకోనప్పుడు ఏ ప్యాకేజీ ఇచ్చినా చివరికి కధ మళ్లీ మొదటికి వస్తుంది.నిజానికి ముఖ్యమంత్రి కాని, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ కాని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇతర ప్రాంతాలకు ఎదురయ్య సమస్యలు ఏమిటి?వాటిని ఎలా పరిష్కరించాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది.కిరణ్ చెప్పేది ఏదో ఆ లక్ష కోట్ల ప్యాకేజీని,రాజధాని నిర్మాణానికి అయ్యే మరో పదివేల కోట్లో, పాతికవేల కోట్లో సీమాంధ్రకే ఇవ్వమంటే , ఆ ప్రాంతానికి మేలు చేసిన వారు అయి ఉండేవారేమో.కాని ఆయన ఆ మాట అంటే సీమాంద్రలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది.ఇప్పుడు సమైక్యవాద ఛాంపియన్ గా ఉన్న ఆయనకు అది ఇబ్బంది కనుక ఆయన ఆ పని చేయలేరు. ప్రత్యేకవాదిగా ఉండి సమైక్యవాదిగా మారిన పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రాన్ని విడదీయడంలో చిక్కులు ఉన్నాయని చెబుతూనే ఒకవేళ విభజన అనివార్యం అయితే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అన్నారు.అలాగే మరికొన్ని సూచనలు చేశారు. ఇది బాగానే ఉంది.తెలంగాణ ఇవ్వడం వల్ల వచ్చే ప్రధాన సమస్యలు ఏమిటి.రాయల తెలంగాణ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏమిటి అన్నదానిపై కేంద్రం చర్చించాలి. బౌగోళికంగా చూస్తే కర్నూలు,అనంతపురం జిల్లాలు కలిపిస తెలంగాణ మంచిదే.కాని కొంతమంది నేతలు తమ రాజకీయ అవసరాల కోసం రాయలసీమ పెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీమాంద్ర జిల్లాలకు ఈ రెండు జిల్లాలు దూరంగా ఉంటాయి. అందువల్ల ఒకవేళ విభజన చేస్తే ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలంటే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేలలో చాలామందికి ఆ కోరిక ఉంది. కాని బయటపడాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు.పది జిల్లాల తెలంగాణనే ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్నా, తప్పని సరి అయితే ఈ ప్రతిపాదనను అంగీకరించవచ్చు. అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది.అది సీమాంధ్ర కు సమస్య అవుతుందా అన్న చర్చ కూడా ఉంది.ప్రదానమైన నదీజలాల సమస్యకు ఒక అవగాహనకు కేంద్రం ముందుగానే రావాలి.బవిష్యత్తులో మరిన్ని సమస్యలు రాకుండా కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాకే తెలంగాణ అయినా, రాయల తెలంగాణ అయినా ప్రకటించాలి.పోలవరం, పులిచింతల,నాగార్జున సాగర్, రాయలసీమకు నీటి వనరుల వంటి విషయాలలో నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసి వాటిని అందరూ ఆమోదించేలా చేయాలి.ఇక హైదరాబాద్ సమస్య ఉండనే ఉంది. ఇక్కడ నివసించే వారి భద్రతకు డోకా రాకుండా కొన్నేళ్లపాటు దీనిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ ఉంది.సీమాంధ్ర కొత్త రాజదాని పూర్తి స్థాయిలో వచ్చేవరకు కొంతకాలం అలా ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగా పెట్టడంలో తప్పులేదు.ఈ రెండు చర్యలు తీసుకున్న తర్వాత సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పెద్దగా అభ్యంతరం చెప్పనవసరం లేదనిపిస్తుంది.తెలంగాణ ఇస్తే ఏర్పడేది కొత్త రాష్ట్రం అవుతుంది. పేరు పాతదే అయినా మొత్తం కొత్త సంసారమే.మంత్రి పార్ధసారధి వంటివారు విజయవాడ రాజధాని చేయాలని సూచించారు.విజయవాడ వద్ద ఎపిఐఐసి నిర్మించిన ఐటి టవర్లలో ఆరులక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందని చెబుతున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడ రాజధాని పెడితే బాగానే ఉంటుంది. విమనాశ్రయం కూడా కూతవేటు దూరంలో ఉంటుంది.లేదా ఇక్కడ ఏదైనా సమస్య ఉంటుందనుకుంటే ఒంగోలు వంటి ప్రాంతంలో కూడా రాజధాని పెట్టవచ్చు.నిజానికి కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆంద్రప్రాంతంలో అబివృద్దికి ఎంతో ఆస్కారం ఉంటుంది.కోస్తా తీర ప్రాంతం వెయ్యి కిలోమీటర్ల దూరం ఉటుంది.ఒక ప్రణాళికబద్దంగా అభివృద్ది చేయడానికి అవసరమైన నాయకత్వం ఇప్పుడు ఆంధ్రకు అవసరం.హైదరాబాద్ ను మించిన నగరాన్ని అబివృద్ది చేయడానికి ప్రయత్నించవచ్చు.అయితే కచ్చితంగా ఇందుకు ఆదాయవనరుల సమస్య వస్తుంది. దానిని పరిష్కరించవలసి ఉంటుంది.కనుక లక్షన్నర కోట్ల ప్యాకేజీని కనుక ఆంధ్రకు ఇస్తే అందరూ స్వాగతించడం మంచిది అవుతుంది.కాని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ వంటివారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.కాని ఎల్లకాలం ఇలా తగవులు పడే కన్నా ఏదో ఒక పరిష్కారం చేసుకుని విడిపోవడమే బెటర్. తెలంగాణ ఇస్తే ఇతర రాష్ట్రాలలో డిమాండ్లు వస్తాయని వీరు చెబుతుంటారు.అది మనకు సంబందించిన అంశం కాదు. కేంద్రం,సోనియాగాంధీ తేల్చుకోవాలి.ఆ సంగతి తెలియకనే కాంగ్రెస్ హై కమాండ్ ఇంతవరకు తీసుకువచ్చారా అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు.అలాగే నక్సలిజం పెరుగుతుందన్న వాదనకు కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. కేంద్రం గతంలో తెలంగాణ ప్రక్రియ ఆరంభమైందని ప్రకటించినప్పుడు ఎన్నికల మానిఫెస్టోలో తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ అనుకూలమని ప్రకటించినప్పుడు , మిగిలిన పార్టీలు కూడా తెలంగాణకు ఓకే చేసినప్పుడే వీటన్నటిని ఆలోచించాలి. కనుక ద్వేషభావాలతో ఎల్లకాలం కలిసి ఉండడం కన్నా, విడిపోయి కలిసి ఉండాలన్న విధానం మంచిదే. కాని అలా ఉండగలుగుతారా?ఒక్కసారి విడిపోయాక,ఇంకా విద్వేషాలు పెరుగుతాయా అన్న అనుమానం కొందరిలో ఉండవచ్చు.కాని రాజకీయ పార్టీలు బాద్యతారాహిత్యంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఓట్ల రాజకీయంగా ఇలాంటి విషయాలను మార్చిన తర్వాత వాటని జనం భరించక తప్పదు.ఏది ఏమైనా ఒక్కటి మాత్రం వాస్తవం.సత్వరమే కేంద్రం రాష్ట్ర విభజన చేసి సీమాంమాంధ్రకు లక్షన్నర కోట్ల ప్యాకేజీ ఇస్తే కనుక దానిని స్వాగతించాలి.అంతే తప్ప సీమాంధ్రకు ఎలాంటి ప్యాకేజీ లేకుండా రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ పాపం మూటకట్టుకుంటుందని అనుకోనవసరం లేదు.

Leave a comment