రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చిన 2 రిపోర్టులు

రాష్ట్రం రెండు నివేదికల కారణంగా రావణాకాష్టంగా మారినట్లు అర్ధమవుతోంది. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం రెండువేల తొమ్మిది డిసెంబరు పందొమ్మిదో తేదీన ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య రాసిన ఒక నివేదిక కారణంగా కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకుని అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన ప్రకటనను మార్చుకుని డిసెంబరు ఇరవైమూడో తేదీన మరో ప్రకటన చేసిందన్నది ఆ కధన సారాంశం.కేంద్ర హోం మంత్రి చిదంబరానికి రోశయ్య ఒక నివేదిక పంపుతూఆంద్ర,రాయలసీమ ప్రాంతాలలో చిదంబరం ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని తెలిపారు. 2.25లక్షల మంది నిరసనలలో పాల్గొన్నారని, ఆంధ్ర,రాయలసీమలలో 1141 ఆందోళనలు జరిగాయని, వీటిలో ర్యాఈలు,ధర్నాలు,ఆమరణ నిరాహార దీక్షలు,రైల్ రకోలు, రాస్తారొకో తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు. ముప్ప హింసాత్మక ఘటనలు జరిగాయని కూడా రోశయ్య పేర్కొన్నారు.కృష్ణ,గుంటూరు, అనంతపురం జిల్లాలలో రెండు రోజుల పాటు బంద్ జరిగిందని, తూర్పు గోదావరి జిల్లాతోపాటు చిత్తూరు,కరనూలు, పశ్చిమగోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో డిసెంబరు పందొమ్మిదిన బంద్ జరిగిందని తెలిపారు. అలాగే విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ తోపాటు పలువరు ఆంధ్ర,రాయలసీమ నేతలు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారని లగడపాటి, దేవినేని ఉమామహేశ్వరరావు, వై.ఎస్.వివేకానందరెడ్డిలను ఆస్పత్రులకు తరలించామని, ఉమా, వివేకాలు ఆస్పత్రులలో చికిత్సకు నిరాకరిస్తున్నారని కూడా ఆ నివేదికలో తెలిపారు.కడప జిల్లాలో 48 గంటల బంద్ జరిగిందని,ఇలా రకరకాల అంశాలతో నివేదిక ఇచ్చారని ఆ పత్రిక తెలిపింది.సమాచార హక్కు చట్టం కింద ఈ నివేదిక కాపీని సంపాదించారు. అయితే కృత్రిమమైన సమైక్య ఉద్యమాన్ని బూచిగా చూపించారని, ఈ సందర్భంగా ఆ నివేదికలోని అంశాలను ఖండిస్తూ, అందులోని లోపాలను ఎత్తి చూపుతు రాశారు. ఆ మీదట చిదంబరం డిసెంబరు ఇరవై మూడో తేదీన తెలంగాణ ప్రకటన తర్వాత పరిస్థితులు మారాయని, రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన బేధాభిప్రాయాలు వచ్చాయని , అందువల్ల ఏకాభిప్రాయ సాధనకు విస్తృత స్థాయి చర్చలు ప్రారంభిస్తామని ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నీళ్లు చల్లారని ఈ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ నివేదిక కాపీని సంపాదించినందుకు నమస్తే తెలంగాణ పత్రికను అభినందించాలి.ఇందులో వారు చేసిన వ్యాఖ్యానం కూడా చాలావరకు వాస్తవంగానే భావించాలి. అయితే అదే సమయంలో తెలంగాణ ప్రకటన రావడానికి కూడా ఇలాంటి ఒక నివేదిక కారణమన్న అభిప్రాయం ఉంది.కెసిఆర్ ఆస్పత్రిలో దీక్షలో ఉండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వదంతులు వ్యాపింప చేయడం, ఆయన సెలైన్ ఎక్కించుకుంటున్నా, దానిని దీక్షగానే చెప్పి కొందరు కాంగ్రెస్ పెద్దలు అధిష్టానానికి ఏదో జరిగిపోతోందన్న భావన కల్పించడం, ఛలో అసెంబ్లీ జరిగితే వేలాది మంది మరణించే అవకాశం ఉందని ప్రచారం చేసి అధిష్టానాన్ని , కేంద్రాన్ని భయపెట్టడం వంటివి చేశారన్న అభిప్రాయం ఉంది. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని మొత్తం తెలంగాణ ప్రకటించిన తీరు కాని, ఆ తర్వాత దానిని నిలువరించిన తీరుకాని రెండూ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సమాచారం లేకుండానే చేశాయన్న భావన కలుగుతుంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది వాస్తవమే అయినా, కెసిఆర్ దీక్ష సమయంలో జరిగిన కొన్ని పరిణామాలను మరీ బూతద్దంలో చూపడం, అలాగే లేని సమైక్య ఉద్యమాన్ని ఉన్నట్లు చూపడం , కేంద్రం గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యం గా వ్యవహరించడం వల్ల రాష్ట్రం ఇంత అధ్వాన్న పరిస్థితికి చేరుకుందని చెప్పకతప్పదు.తెలంగాణ ఇచ్చేసినట్లు ప్రకటించినదానికి కట్టుబడి ఉన్నాపెద్ద సమస్య ఉండేది కాదు. రాజధాని, ఇతర సమస్యలపై కమిటీని వేసి పరిశీలించి ఉంటే సీమాంధ్రకు ప్యాకేజీ ఇచ్చి ఉంటే సరిపోయేది. లేదూ డిసెంబరు ఇరవైమూడు లేదా ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధ్యపడదు అని స్పష్టంగా చెప్పినా ఏదో ఒకరకమైన అవగాహన ఏర్పడేది. అలాకాకపోవడం తో రెండువైపులా ఉద్రిక్తతలు , ఉద్యమాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతోంది. అదే దురదృష్టం.

Leave a comment