పరువు నష్టం కేసులతో పత్రికా స్వేచ్ఛకు విఘాతం

భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛ ఇమిడి ఉంటుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాలలో స్పష్టం చేసింది. సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు. అందువలన సమాచారం అందించటమనేది ప్రజల హక్కు అని మీడియా అమలుపరచడమే అవుతుంది. అయితే ‘యదార్ధవాది లోక విరోధి’ అన్న చందంగా యదార్ధ వార్తలను కొందరు వివాదాస్పదం చేస్తుంటారు. వక్రీకరించారని, నిరాధారాలని, తప్పుడు వార్తలని బుకాయించటం సర్వ సాధారణమైంది. వాస్తవంగా తప్పుదోవ పట్టించే వార్తలు అభ్యంతరకరమే. అలాంటి వార్తలను నిరోధించటానికి ప్రింటు మీడియాకి సంబంధించి ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం ఎలాగూ ఉంది. ఇక ఆధారాలు లేని నిజాలు అనేకం ఉంటాయి. అవి నిరూపించటం సాధ్యంకాదు. అందుకనే అలాంటి వార్తలు సత్యదూరాలని ఎలాంటి ప్రజోపయోగం లేదని ఉద్దేశ్యపూర్వకంగా తమ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించడానికి మాత్రమే ఆ వార్తలు వెలువడ్డాయని నిరూపించాల్సిన బాధ్యత ఫిర్యాదుదారునిదే అని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అయినాగాని నిజాయితీగా విధులు నిర్వహించే విలేకరులు పలువురు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణ కత్తిమీద సాములా ఉంటుంది. ముఖ్యంగా భారత శిక్షా స్మృతి 499 సెక్షన్‌ని కొందరు నిజాయితీగా నిజమైన వార్తలు రాసే విలేకరులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆఖరికి నమోదైన లేక రికార్డులకెక్కిన చిన్నాచితక నేరగాళ్లు సైతం తమ నేరచరిత్రకి సంబంధించి వార్తలు ప్రజలకందించిన మీడియాపై పరువునష్టంగా చిత్రీకరించి ఈ పరువు నష్టం సెక్షన్‌ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. అయితే అలాంటి కేసులు కోర్టులలో ఎలాగూ వీగిపోతాయి. కాని సంవత్సరాలు తరబడి ముద్దాయిగా వాయిదాలకు తిరగాలి. ఆరోపణల దాడి ద్వారా కోర్టు కేసుల నుండి బయటపడటానికి పెద్దఎత్తున ఖర్చు చేయాలి. రోజు రోజుకి పెరిగిపోతున్న జీవన వ్యయాల కారణంగా పరువు నష్టం క్రిమినల్‌ కేసుకి కనీసం 10 వేలు ఖర్చు చేయనిదే ఏ న్యాయవాది న్యాయం చేయలేరు. లేదా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కింది కోర్టులలో విచారణ నిలిపివేయించి కేసు రద్దు చేయించాలంటే 10 నుండి 20 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విలేకర్లకి యాజమాన్యం సహకరిస్తే పర్వాలేదు. లేకపోతే రెండు విధాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఇక చిన్న, మధ్యతరహా పత్రికలలో పనిచేసే విలేకరులకైతే తాము చేస్తున్న వృత్తి దినమొక గండంగా ఉంటుంది.
ఈ సందర్భంగా పరువు నష్టం సెక్షన్‌ 499 ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో ఇటీవల మన రాష్ట్రంలో ఒక విలేకరిపై దాఖలైన క్రిమినల్‌ కేసు రుజువు చేస్తుంది. ఒక స్వచ్ఛంద సంస్థ ముసుగులో అధికార అనధికారులపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేయడమే వృత్తిగా జీవిస్తూ పలు అర్ధ న్యాయస్థానాల, దర్యాప్తు సంస్థలచే తీవ్ర విమర్శలకి, వ్యాఖ్యలకి గురైన ఒక సాధారణ నేరగాడు విలేకరులను సైతం వదిలిపెట్టడం లేదు. తన అరాచకాలకు పత్రిక ద్వారా అడ్డుతగులుతున్నాడనే అక్కసంతో తన క్రిమినల్‌ బ్రైన్‌ను ఉపయోగించి ఒక విలేకరిపై ఐపిసి 499 కింద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఈ సెక్షన్‌ నాన్‌ కాగ్నజబుల్‌. అంటే పోలీస్‌శాఖ తప్పనిసరిగా విచారణ చేయాల్సిన సెక్షన్‌ కాదు. క్రిమినల్‌ కోర్టు నేరుగా విచారణకి స్వీకరించవచ్చు. అదొక ప్రైవేట్‌ కేసు. ప్రైవేట్‌ కేసులో ఈ సెక్షన్‌ కింద పోలీస్‌ విచారణ జరిపించమని సైతం కోర్టుని కోరవచ్చు. కాని పోలీసులకి ఇతని నేర చరిత్ర తెలుసు కాబట్టి వ్యతిరేక నివేదిక వస్తుందనే కారణంగా కోర్టువారే నేరుగా విచారణ జరపాలని కోర్టుకు విన్నవించుకొన్నారు. ఆ మేరకు మేజిస్ట్రేట్‌ కోర్టువారు విచారణకు స్వీకరించి ఇటీవల ఆ విలేఖరికి సమన్లు జారీ చేశారు. కోర్టులో దాఖలైన ఈ కేసులో పత్రాలు పరిశీలిస్తే, సహజంగా కేసుకి సంబంధించి ఫిర్యాదులోని అంశాలు స్పష్టంగా, సూటిగా ఉండాలి. వాటికి మద్దతుగా ఆధార పత్రాల వివరాలు ఉటంకించాలి. కాని ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న నేరగాడు సంబంధం లేని అంశాలతో మూడు కేజీల ఫిర్యాదు నింపాడు. అతను కేసు దాఖలు చేసింది తప్పు వార్తలు ప్రచురించారనే ఆరోపణ కాబట్టి ఏ తేదీ, ఎన్నో పేజిలో, ఏ పేరుతో, ఏ అంశం గురించి వార్త తప్పు ప్రచురించారో ఎలాంటి వివరాలు ఫిర్యాదులో పేర్కొనలేదు. కేవలం తన గురించి రాసిన వార్తలకి సంబంధించి పత్రికలు ఫిర్యాదుతో జత చేశాడు. ఆ వార్తలు అబద్ధాలనడానికి నిజాలు ఏమిటో ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదు. అసత్యవార్తలు ప్రచురించానడానికి ఒక్క రికార్డు పూర్వక ఆధారం సైతం దాఖలు చేయలేదు. ఆ విలేకరి పేరు సైతం ఉన్న ప్రెస్‌ అక్రిడిటేషన్ల జాబితా జతచేశాడు. దాఖలు చేసిన కేసుకి అక్రిడిటేషన్ల జాబితాకి అసలు సంబంధమే లేదు. ఇలా అసలు సంబంధం లేని పత్రాలు ఆరుదాకా జతపరిచాడు. అనేకమందిని పలు నేరగాళ్లుగా పేర్కొంటూ, అసభ్యకరంగా వార్తలు రాశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ అనేకమంది వివరాలు ఏమీలేవు. అసభ్యకరంగా ఎప్పుడు, ఏమి రాశారో వివరాలు పేర్కొనలేదు. అలా రాసిన ఒక్క వార్త క్లిప్పింగ్‌ సైతం జతచేయలేదు. వాస్తవానికి ఆ పత్రికలో ఎప్పుడూ ఒక పదమైనా ఎవరిపైనా అసభ్యకరంగా రాయడం జరగలేదు. ఆ పత్రిక కుటుంబ సమేతంగా అందరూ చదువుకునేది. తనపై మాత్రం అసత్యవార్తలు రాశారని మాత్రమే ఫిర్యాదులో పేర్కొన్నాడు. అర్ధ న్యాయస్థానాలు జారీచేసిన ఉత్తర్వులు, తీర్పులు ఇతర పబ్లిక్‌ డాక్యుమెంట్స్‌ ఆధారంగా ఆ విలేకరి వార్తలు రాయడం జరిగింది. కేసుల నెంబర్లు, పబ్లిక్‌ డాక్యుమెంట్స్‌, సూచికలు సైతం విలేకరి వార్తలలో స్పష్టంగా పొందుపరిచాడు. ఇక ఆరుమంది అధికారులను సాక్షులుగా విచారించాలని ఫిర్యాదులో పేర్కొ న్నాడు. సహజంగా ఏదైనా ఒక అంశంపై ఎవరైనా రాతపూర్వక వాగ్మూలం ఇచ్చి ఉంటే మరింత సమాచారం కోసం వారిని సాక్షులుగా పిలుస్తారు. కాని రాసిన వార్తల్లోని అంశాలకి సాక్షులుగా పేర్కొన్న అధికారులకి సంబంధమే లేదు. ఒక క్రిమనల్‌ కేసులో పాటించాల్సిన న్యాయ ప్రక్రియకి అనుగుణంగా ఫిర్యాదు లేదు. పాటించాల్సిన విధివిధానాలు అనుసరించలేదు. అవసర మైన పత్రాలు సైతం దాఖలు చేయలేదు. కాని తనపై ప్రచురించిన వార్తలు తప్పుడు తడకలని కోర్టులో స్వీకరణ సమ యంలో ప్రమాణపూర్వక వాంగ్మూలం ఇచ్చి కోర్టుని నమ్మించి కేసు అడ్మిట్‌ చేయించాడు. అయితే కేసు విచారణకి స్వీకరించిన మాత్రాన ముందుకొచ్చే ఉపద్రవం ఏమీ ఉండదు. కాకపోతే అకారణంగా, అన్యాయంగా కేసులో ఇరుక్కొని ఒక ముద్దాయిగా వాయిదాలకి తిరగాలి. ఫిర్యాది తన క్రిమినల్‌ బ్రైన్‌ ఉపయోగించి ఎంత గారడీ చేసినా పూర్తిస్థాయి విచారణలో ఎలాగూ కేసు వీగిపోతుంది. కాకపోతే అప్పటిదాకా తనపై నిజాలు రాసిన విలేకరిని క్రిమినల్‌ కేసులో ఇరికించి కోర్టుకి ఈడ్చాననే పైశాచిక ఆనందం ఫిర్యాది పొందుతాడు. ఇలాంటి నిరాధార కేసులు పనిభారం కారణంగా పూర్తిగా అన్ని పత్రాలు పరిశీలించలేక స్వీకరించినాగాని కేసు నుండి విముక్తి పిటీషన్‌ (డిస్చార్జ్‌ పిటీషన్‌) అదే కోర్టులు దాఖలు చేయవచ్చు. అప్పుడు ప్రధాన కేసు నిలిపివేసి, ఆధారాలకి సంబంధించి విచారణ జరిపి, నిరాధార కేసు అని తేలితే ప్రధాన కేసు రద్దుచేసి విలేకరికి విముక్తి కల్పిస్తారు. లేక కింది కోర్టులో విచారణ నిలుపుదల చేసి, ప్రధాన కేసు రద్దుచేయమని ఉన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించవచ్చు. వీటిలో ఏది చేయాలన్నా ఖర్చుతో కూడిన పని. కింది కోర్టులలో విపరీతమైన పనిభారం కారణంగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిరాధార కేసులు సైతం అడ్మిట్‌ అవుతూ ఉంటాయి. కాని నష్టపోయేది మాత్రం నిజాలు రాసిన విలేకరులే. అలాగే మూడు సంవత్సరాల క్రితం రికార్డుకెక్కిన మరొక నేరగాడు తన గురించి తప్పు వార్తలు ప్రచురించారని, అందువల్ల పరువుకి నష్టం కలిగిందని కాబట్టి 20 వేల రూపాయలు విలేకరి నుండి ఇప్పించాలని వినియోగదారుల చట్టం కింద ఒక జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయగా తమ పరిధిలో లేకపోయినాగాని ఫోరంవారు విచారణకి స్వీకరించి విలేకరికి నోటీసు జారీచేశారు. తరువాత ఎలాగూ ఆ కేసు వీగిపోయింది. దానిపై రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో సైతం దాఖలైన అప్పీలు స్వీకరణ స్థాయిలోనే కొట్టివేశారు. రెండు చోట్లా కేసులు వీగిపోయినాగాని ఆ విలేకరికి జరిగిన ధన నష్టం సంగతి ఎలా ఉన్నా పడిన ఆవేదన పూడ్చలేనిది. కేసు విచారణ జరుగుతున్న సంవత్సర కాలంలో నిజం రాసినందుకు అన్యాయంగా సివిల్‌ కేసులో ఇరుక్కొని అవమానంతో ఆ విలేకరి పడిన మానసికక్షోభ వర్ణనాతీతం. ఏది ఏమైనా రికార్డులకెక్కిన నేరగాళ్లుసైతం పరువునష్టం పేరుతో ఆషామాషీగా నిరాధార సివిల్‌, క్రిమినల్‌ కేసులు దాఖలుచేసి పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగించకుండా, ఐపిసి 499 సెక్షను దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం తగుచర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రచయిత వినియోగదారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు

Leave a comment