ప్రేమ విస్పోటన -అరుంధతి రాయ్

 

‘దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్’
దేశాన్ని ప్రేమిస్తే చాలదట భక్తి కావాలంట
‘భారత్‌ మాతాకి జై’ దేశభక్తి
మనుషుల్ని ప్రేమించి మట్టిని అమ్ముకుంటే
భారతమాత పట్ల భక్తి పెరుగుతుందా?

‘ఇదేం ప్రేమ?’

దేశం పట్ల మనకుండే ప్రేమ ఎటువంటిప్రేమ?

ఇదేం దేశం?

ఎన్నడూ మనస్వప్నాలను సాకారం చేయలేని దేశం
ఇవేం స్వప్నాలు?
సదా భగ్నమయ్యే స్వప్నాలు’

‘గొప్ప జాతుల గొప్పతనాలు ఎప్పుడూ
వాటి నిర్దాక్షిణ్యమైన మారణ సామర్ధ్యానికి
ప్రత్యక్ష సమతూకంతో ఉంటాయికదూ’
‘ఒక దేశ విజయం
సాధారణంగా దాని నైతిక వైఫల్యంలో ఉంటుంది కదూ.’
‘మన వైఫల్యాల సంగతేంటి?

రచయితలు, కళాకారులు, రాడికల్స్, జాతి ద్రోహులు, పిచ్చివాళ్ళు
వ్యవస్థలో ఇమడలేనివాళ్ళు-
వీళ్ళ భావాల, స్వప్నాల వైఫల్యాల సంగతేమిటి?’
‘జెండాల, దేశాల భావాన్ని
ప్రేమ అనే ఒక విస్ఫోటన పదార్థంతో
మార్చలేకపోతున్న మన వైఫల్యాల సంగతేమిటి?’

‘మనుషులు యుద్ధాలు లేకుండా జీవించలేకపోతున్నారా?’

కాందిశీకులు, కరువు బాధితులు కాకుండా,
వలసలు, ఆత్మహత్యలు లేకుండ
ఎన్‌కౌంటర్లు, అసహజమరణాలు లేకుండా జీవితంలేదా?’
‘మనుషులు ప్రేమలేకుండా కూడా జీవించలేరుకదా
ప్రేమకోసం యుద్ధాలకు మరణాలకు వెనుకాడరు కదా
యుద్ధాల బహిరంగ పగలు రహస్య ప్రేమ రాత్రులు’

‘కనుక ప్రశ్న ఏమిటంటే
మనం దేన్ని ప్రేమించాలి?

ప్రేమంటే ఏమిటి? ఆనందమంటే ఏమిటి?

అవును నిజంగానే దేశమంటే ఏమిటి?’
మనుషులమధ్య ప్రేమేకదా
అంతేనా?

‘మన ప్రేమకు ప్రాధామ్యాలేమిటి?’
మనుషులం కనక మానవత్వం సరే-
మరిమట్టిని ప్రేమించవద్దా?
‘అత్యంత అర్వాచీనమైన దట్టమైన అడవి
పర్వతశ్రేణులు, నదీలోయలు’
భూగర్భజలాలు, ఖనిజాలు
మానవశ్రమ, ప్రకృతి సంపద
అవును-ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ, గ్రహాలు
గాఢాంధకారంలో ఇనుమిక్కిలి నక్షత్రాలు
ఇంకిన, కారుతున్న కన్నీళ్లు. పారుతున్న, గడ్డకట్టిన నెత్తురు
‘దేశంకన్నా ప్రేమించదగినవి కదూ.’
నేను పోగొట్టుకున్న నదీలోయలను
పోరాడుతున్న పడమటి కనుమలను
పోగొట్టుకున్న నల్లమలను
పోరాడుతున్న దండకారణ్యాన్ని
ప్రేమించినంతగా
దేశభక్తి, జాతీయత అనే భావనలను ప్రేమించగలనా?

అబద్ధమాడలేను,

ఎందుకంటే,

ప్రేమ విస్ఫోటనం చెందే సత్యం.

(ఆంగ్లమూలం: అరుంధతీ రాయ్)