అలుపెరగని బిజెపి రథసారధి అద్వానీ

కమలాన్ని గద్దెనెక్కించిన కురువృద్ధుడు
ఎల్‌కె అద్వానీని భారతరత్నతో గౌరవించిన కేంద్రం
లాల్‌ కృష్ణ అద్వానీ..ఈ పేరే ఒక బ్రాండ్‌.14ఏళ్లకే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ులో చేరి..జన్‌సంఫ్‌ుతో ప్రజలకు చేరువైన ప్రజానేత. గోరంత బిజెపిను కొండంత చేసిన అగ్రనేత. రెండు సీట్ల కాషాయ దళాన్ని ఢల్లీి పీఠం ఎక్కించిన అలుపెరగని రథసారథి. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డిఎ)కు రూపకల్పన చేసిన రాజకీయ శిల్పి. కీర్తిప్రతిష్టలతో పాటు అపవాదును తన మకుటంలో నిలుపుకొన్న అయోధ్య ఉద్యమకారుడు. పార్టీతోపాటే ఎదిగి ఉప ప్రధాని అయిన రాజనీతిజ్ఞుడు! ప్రధాని కల తీరకుండానే అస్త్ర సన్యాసం చేసిన బిజెపి భీష్మ పితామహడు.ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి..ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. పార్లమెంటులో ఆయన అనుభవం మనకు ఎన్నటికీ ఆదర్శప్రాయం. అద్వానీజీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారు. రాజకీయ కురువృద్ధుడు, బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’తో గౌరవించింది. ఈనేపథ్యలో ఆయన జీవిత విశేషాలతో అక్షరదీక్ష ప్రత్యేక కథనం…
14ఏళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌లోకి…
అద్వానీ పూర్తి పేరు లాల్‌ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్‌ 8న అవిభక్త భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. అక్కడే సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఎల్‌కె అద్వానీకి స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులోనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయన ప్రయాణం అనుకోకుండానే జరిగిందని తన ఆత్మకథలో చెప్పారు. అద్వానీ తండ్రి సింధ్‌ నుంచి హైదరాబాద్‌ (పాక్‌)కు మారారు. అప్పటికీ మెట్రిక్యులేషన్‌ పూర్తయిన అద్వానీ కళాశాలలో చేరడానికి ముందు సెలవురోజుల్లో టెన్నిస్‌ ఆడేవారట. అలా ఒకరోజు తన స్నేహితుడు ఆటమధ్యలో వెళుతుండగా.. ‘ఎందుకు వెళ్లిపోతున్నావ్‌’ అంటూ ఆయనను ప్రశ్నించారు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరానని, అనుకున్న సమయానికి వెళ్లాల్సిందేనని చెప్పాడు. అలా తొలిసారి ఆర్‌ఎస్‌ఎస్‌ పేరును అద్వానీ విన్నారు. తర్వాత దాని గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకొని తర్వాత ఓ రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖకు హాజరయ్యారు. అలా ప్రారంభమైన తన జీవితం.. సంఫ్‌ుకు అంకితమైందని తన ఆత్మకథలో ఆయన వివరించారు. పాక్‌లోని హైదరాబాద్‌లో గల డిజి నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్యను పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ..రాజస్థాన్‌లో సంఫ్‌ు ప్రచారక్‌గా పనిచేశారు. 1957లో ఢల్లీికి వెళ్లి జన్‌సంఫ్‌ు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢల్లీి మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఢల్లీి మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా గెలిచారు. 197072లో భారతీయ జనసంఫ్‌ు ఢల్లీి విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆర్గనైజర్‌ అనే పత్రికలో నేషనల్‌ ఎగ్జిక్యూటివన సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లోకి.. 1970లో ఢల్లీి నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్‌ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆపార్టీ ప్రభుత్వంలో 197779 వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
బిజెపిని స్థాపించి..
1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఫ్‌ు నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్‌పేయీతో కలిసి 1980 ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆ ప్రస్తుతం 13రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బిజెపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. ఓటమితో నిరుత్సాహపడకుండా విజయం కోసం అద్వానీ అహర్నిశలూ శ్రమించారు. ఆయనలోని ఆ పోరాట పటిమ, క్రమశిక్షణ వెనక రాష్ట్రీయ స్వయంసేవక్‌ మూలాలూ ఓ కారణం. ఆ సంస్థతో ఆయనది సుదీర్ఘ అనుబంధం. అయితే, సంఫ్‌ులో అద్వానీ చేరిక కూడా అనుకోకుండా జరిగిందే. ఈ విషయాన్ని ఆయనే తన ఆత్మకథ ‘ మై కంట్రీ మై లైఫ్‌’లో పేర్కొన్నారు.
లోక్‌సభలో సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా..
2004 ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలవ్వడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బిజెపి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీ నగర్‌ నుంచి గెలుపొందిన అద్వానీ.. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
హిందుత్వ పోస్టర్‌ బాయ్‌…
భారతీయ జనతాపార్టీకి అచ్చమైన హిందూత్వ పోస్టర్‌ బాయ్‌ అద్వానీనే..అసలు పార్టీకి హిందూత్వ రంగు అద్దిందే ఆయన. 1983నాటికి లోక్‌సభలో కాషాయ పార్టీకి కేవలం రెండే రెండు సీట్లు దక్కాయి. అలాంటి కష్టకాలంలో పార్టీ పగ్గాలను అందుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ..అంతర్గత కలహాలు, అవినీతి వంటి సమసయల్లో చిక్కుకుంది. వాటిని గమనించిన అద్వానీ..బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించాలని నిర్ణయించారు. ఆ అజెండాను తెరపైకి తెచ్చారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని నినదించారు. 1989లో రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన రథయాత్ర ఓ వర్గం ఓట్లను సంఘటితం చేసింది. బిజెపి గెలుపునకు బాటలు వేసింది.
కమ్యూనిస్టులతో అధికారం..
బిజెపి, కమ్యూనిస్టులంటేనే ఉప్పూనిప్పూ వ్యవహారం. ఆరెండు పార్టీల మధ్య వైరం ఇప్పటిది కాదు. అలాంటి కమ్యూనిస్టులతో నాటి జన సంఫ్‌ు (బిజెపికి పూర్వ రూపం) అధికారం పంచుకుందంటే ఆశ్చర్యమే. అదీ అద్వానీ హయాంలోనే జరగడం గమనార్హం. అది 1958. ఢల్లీి కార్పోరేషన్‌కు జరుగుతున్న తొలి ఎన్నికలు. అప్పట్లో కాంగ్రెస్‌, జన సంఫ్‌ులు పోటీపడ్డాయి. అధికారాన్ని నిర్ణయించగల స్థాయిలో సిపిఐ ఉండేది. సంఫ్‌ును దూరం పెట్టేందుకు కాంగ్రెస్‌తో సిపిఐ పొత్తు కుదుర్చుకుంది. అరుణా అసఫ్‌ అలీని ఢల్లీి మేయర్‌గా ఎన్నుకుంటేనే మద్దతిస్తామని సిపిఐ ప్రకటించడం..అందుకు కాంగ్రెస్‌ అంగీకరించడంతో అధికార పీఠం జన సంఫ్‌ు చేజార్చుకుంది. ఏడాది తిరగకముందే అంతర్గత కుమ్ములాటల వల్ల ఏడాదిలోనే పొత్తు ముగిసింది. దీంతో కమ్యూనిస్టులతో జన సంఫ్‌ుకు వ్యూహాత్మక పొత్తు కుదిరింది. ఈ విషయంలో అద్వానీ కీలకంగా వ్యవహరించారు. హిందూ మహాసభకు చెందిన సభ్యుడితో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్‌,డిప్యూటీ మేయర్‌ పదవులను రెండు పార్టీలు పంచుకున్నాయి. రొటేషన్‌ పద్ధతిలో అధికారాన్ని మార్చుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. 1998లో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అద్వానీ హోంమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. మార్చి 19న ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు సాయంత్రం కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ సిఎం ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ మరణించారని సమాచారం వచ్చింది. ప్రధాని వాజ్‌పేయీ స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. పార్టీ పరంగా తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకు ఆయనను ఎంతో గౌరవించేవాడినని తన ఆత్మకథలో పేర్కొన్నారు. మర్నాటు ఉదయం ఈఎంఎస్‌ అంత్యక్రియలు జరిగాయి. భారత ప్రభుత్వం తరపున అద్వానీ నివాళులర్పించారు. తన ఆత్మకథలో ఈరెండు సందర్భాలను ఆయన ప్రస్తావించారు.
పార్టీకి పలుమార్లు రాజీనామా…
బిజెపికి చుక్కానిలాంటి అద్వానీ..సొంత పార్టీకి రాజీనామా చేశారంటే తెలియని వారికి ఆశ్చర్యమేస్తుంది. మూడుసార్లు ఆయన అలా పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. 2005లో తొలిసారి రాజీనామా చేశారు. పాక్‌ వ్యవస్థాపకుడు జిన్నాను లౌకికవాది అంటూ కొనియాడారు. పాక్‌లోనూ పర్యటించారు. ఈ వ్యాఖ్యలు బిజెపితోపాటు, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పార్టీ సహచరులే తన వెంట నిలవకపోవడం తనను ఎంతో బాధించిందని తన ఆత్మకథలో పేర్కొన్నారు. దీంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా పార్టీలో కొన్ని అంశాలతో విభేదించిన అద్వానీ మూడుసార్లు పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.
బహుదూరపు బాటసారి…
కేంద్రంలో కమలం పార్టీని గద్దెనెక్కించేందుకు అద్వానీ అనేక రథయాత్రలు చేపట్టారు. రామరథ యాత్ర నుంచి మొదలుపెట్టి ఆరు యాత్రలు చేశారు. కాంగ్రెస్‌ అవినీతి, విపి సింగ్‌ ‘మండల్‌ రిజర్వేషన్‌’.. తదితర అంశాలతో సతమవుతున్న దేశ ప్రజలను సమీకృతం చేయడానికి 1990 సెప్టెంబర్‌ 25న గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి ఆయన రామరథ యాత్రకు శ్రీకారం చుట్టారు. బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తనయాత్రను అయోధ్యలో ముగించాలని భావించినా..బీహార్‌లో అప్పటి ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆయనను అరెస్టు చేయడంతో రథయాత్ర మధ్యలోనే ముగిసిపోయింది. ఈరథయాత్ర 1991 ఎన్నికల్లో బిజెపికి బాగా కలిసొచ్చింది. లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1992లో బాబ్రీ విధ్వంసం తర్వాత బిజెపి కేంద్రంలో అధికారానికి దగ్గర చేసింది. 1993లో అద్వానీ చేపట్టిన జనాదేశ్‌ రథయాత్ర. ఆతర్వాత స్వర్ణ జయంతి రథయాత్ర, భరత్‌ ఉదయ్‌ యాత్ర, భారత్‌ సురక్షా యాత్ర వంటివి బిజెపికి కలిసొచ్చాయి. 1996లో బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. 1984లో రెండు సీట్లతో ఉన్న ఆపార్టీ..అద్వానీ, వాజ్‌పేయీ నాయకత్వంలో 161 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక, 2011లో యూపిఏ అవినీతికి వ్యతిరేకంగా జన చేతన యాత్రల పేరిట మరో రథయాత్ర చేశారు.
తనదైన శైలి ప్రసంగాలతో ఆకట్టుకున్న అద్వానీ
తనదైన ప్రసంగాలతో ఆకట్టుకునే అద్వానీకి అసలు హిందీ వచ్చేది కాదట. భారత్‌కు వచ్చేవరకు ఆయనకు హిందీలో అసలు ప్రావీణ్యమే లేదట. హిందీ సినిమాలు చూడడం ద్వారా భాషను అర్థం చేసుకొని వచ్చీరాని భాషలోనే నెట్టుకొచ్చేవారు. 1947 తర్వాత తన 20వ ఏట భారత్‌కు వలస వచ్చిన తర్వాతే హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నానని ఆత్మకథలో వివరించారు. ఆ తర్వాత అదే హిందీలో ఆయన అనర్గళంగా మాట్లాడటమే కాదు.. తనదైన శైలి ప్రసంగాలతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు కూడా.
ఆ కల మాత్రం తీరలేదు..
దేశానికి ప్రధాని కావాలని పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అద్వానీ కలలు కన్నారు. 1999లో వాజ్‌పేయీ ప్రధాని కావడంతో ఆయన ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2004 ఎన్నికల్లోనైనా ప్రధాని పదవిని అధిష్టించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ‘ భారత్‌ వెలిగిపోతోంది’ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. కానీ, ఆ ఎన్నికల్లో కమలానికి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2005లో పాక్‌కు వెళ్లి జిన్నా లౌకికవాది అని పొగడటం వివాదంగా మారింది. ఈ క్రమంలోనే అద్వానీ నేతృత్వంలోని బిజెపి 2009లో మరోసారి పరాజయం పాలైంది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. 2014లో తన కల నెరవేరుతుందని ఆశించినా అది జరగలేదు. చివరకు 2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
నా ఆశయాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది: ఎల్‌కె అద్వానీ
న్యూఢల్లీి: దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో కేంద్రం తనను గౌరవించడంపై రాజకీయ కురువృద్ధుడు, బిజెపి అగ్రనేత ఎల్‌ఖె అద్వానీ స్పందించారు. ఇది తన ఆశయాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘ ఈ భారతరత్న పురస్కారాన్ని అత్యంత వినయం, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. జీవితాంతం సేవ చేయడానికి నేను నమ్ముకున్న సిద్ధాంతాలు, ఆశయాలకు దక్కిన గౌరవం అని అద్వానీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుభసమయంలో వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులు, ఈ లోకం విడిచి వెళ్లిపోయిన భార్య కమలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన..వాళ్ల సహకారంతోనే ప్రజలకు సేవ చేయగలిగానని చెప్పారు. వాళ్లే తన బలమని అన్నారు. 14ఏళ్లలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ులో వాలంటీర్‌గా చేరినప్పటినుంచి..స్వలాభం కోసం ఏనాడూ ఆలోచించలేదని, నిస్వార్థంగా దేశం కోసమే అంకితభావంతో పనిచేశానన్నారు. ఈసందర్భంగా భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయతో కలిసి పనిచేసిన రోజులను ఆయన నెమరవేసుకున్నారు. తనకు ఇంతటి గౌరవం లభించడంలో కీలకపాత్ర పోషించిన పార్టీ నాయకులు, సంఫ్‌ు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.